భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, ప్రతిభ ఉన్నా పరిస్థితుల కారణంగా మసకబారిన వినోద్ కాంబ్లీ బాల్య స్నేహితులు. కష్టాన్నే నమ్ముకుని సచిన్ అంచెలంచెలుగా పైకెదిగాడు. రికార్డుల రారాజు అయ్యాడు. కానీ, కాంబ్లీ ఒక్కసారిగా వచ్చిపడ్డ పేరుప్రతిష్ఠలతో దారి తప్పాడు. ఫలితం, కెరీర్ పతనం దిశగా సాగింది. ఇటీవలే ఓ ఆంగ్ల దినపత్రిక సచిన్ ను కాంబ్లీ గురించి వ్యాఖ్యానించమని కోరింది. దీనికి మాస్టర్ బదులిస్తూ, పరస్పరం విభిన్నమైన వ్యక్తులమని పేర్కొన్నాడు. వివిధ రకాల పరిస్థితుల పట్ల వేర్వేరు రీతుల్లో తాము స్పందిస్తామన్నాడు. అయితే, ప్రతిభ గురించి మాట్లాడబోనని, అది తనకు సంబంధించిన విషయం కాదని అన్నాడు. ముఖ్యంగా, కుటుంబ సభ్యులు తనపై ఎప్పుడూ శ్రద్ధ వహించేవారని, తాను నేల విడిచి సాము చేయకుండా వారే నియంత్రించేవారని సచిన్ చెప్పుకొచ్చాడు. పెంపకం తన ఎదుగుదలలో ముఖ్య భూమిక పోషించిందన్న కోణంలో అభిప్రాయాలు వెలిబుచ్చాడు సచిన్. అయితే, ఈ విషయంలో కాంబ్లీ గురించి మాట్లాడలేనని తెలిపాడు.
No comments:
Post a Comment