SEARCH

Saturday 31 January 2015

పింక్ స్లిప్

ఒకానొక రైతు  పెట్టిన కంపెనీ లో  అదేనండి   ఇంట్లో  ఒక  HR  అంటే కోడి , చెప్పినదానికి తలాడించే ఒక చెంచా అదేనండి గొర్రె , పైవాడు చెప్పిందానికి  కష్టపడటమే మార్గం అనుకునే ఒక ఎద్దుగారు పని చేస్తున్నారు. వీళ్ళకి తోడుగా ఒక ఆఫీసు బాయ్  ఒక ఎలుక కూడా వుంది.
సరే  రైతు ఎలుకను  పింక్ స్లిప్ ఇచ్చి  అంటే బోను తెచ్చి బయటకు పంపెద్దామని తయారు అయిపోతాడు.
ఇంట్లోకి బోను, ఎలుక వంట్లోకి భయం వచ్చి చేరతాయి.
మనకు కష్టం వస్తే మన బాస్  దగ్గరకు  వెళ్తాం కదా ! అలాగే  ఎలుక, ఎద్దు దగ్గరకు వెళ్లి తన కష్టం చెప్పుకుంటే
తను సహాయం చేయలేను అని అంటుంది  ఎద్దు.
గొర్రె దగ్గరకు వెళ్తే మునుపెన్నడు నాకు ఇటువంటి కష్టం రాలేదు, కాబట్టి ఏమి చేయాలో నాకు తెలీదు అంటుంది.
కోడి నీకష్టం నీ ఇష్టం అంటుంది.
ఎవ్వరు సహాయం చేయతలేదని ఏడుస్తూ ఇంట్లోకి వెళ్ళిపోతుంది ఎలుక.
 ఆ రాత్రి బోనులో ఏదో చిక్కినట్లు శబ్దం వస్తే, చూడటానికి వెళ్తుంది రైతు భార్య .
బోనులో చిక్కిన తన తోకను తీసుకోవడానికి అవస్త  పడుతున్న  పాము, రైతు భార్యను  కాటు వేస్తుంది !
 ఆమెకు వచ్చిన విష జ్వరాన్ని తగ్గించడానికి, రైతు కోడి పులుసు తాగిస్తాడు , కాని తగ్గదు జ్వరం.
సరే ఆమెను పరామర్శకోసం  వస్తున్న వారికోసం గొర్రెగారు  ఖర్సు ! అవుతారు .
కొన్నిరోజులకు రైతు భార్య మరణిస్తుంది.  ఆ రోజులకు ఎద్దు బలి !
ఇలాగ  అన్ని ఇంట్లోంచి వెళ్ళిపోయినా  ఒక్కరు మాత్రం ఉండిపోతారు !?
ఎవరంటే  ఎలుకగారు !

అందుకే  మన  జట్టులో   ఎవరికైనా  కష్టం  వస్తే,  ఆదుకోకపోతే    ఆ  కష్టం మనకు నష్టం  తేవచ్చు !

ఇదే కధ  ఇక్కడ  వినవచ్చు
https://www.youtube.com/watch?v=3R49Lu56piU

Friday 30 January 2015

ఆంధ్రులారా చేవ చచ్చినవారా ? ఆంధ్రోల్లు అంటే అంత చులకనా !

విడగొట్టడం  ఇంత  వీజీయా  అన్నట్టుగా  విడదీసేసారు
ప్రత్యేకం అని అడిగిన వారికి రాజధాని, మిగులు  మూల ధనం  ఇచ్చి
విడిపోవద్దు  అన్న వారికి  రాజధాని లేదు,  మిగులు మాట దేముడు ఎరుగు మింగ మెతుకు లేదు .

మేము అన్యాయం  చెయ్యం. అంటూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి  రాజ్య సభలో  ప్రత్యేక హోదా గురించి మేమే అడిగాం అని జబ్బలు చెరచిన  కమల వీరులు ఇప్పుడు ఇతర రాష్ట్రాలు  ఒప్పుకోవాలి అంటున్నారు.

ఆంధ్రోల్లు అంటే అంత  చులకనా !
   ఇంకా ఎంత కాలం మీకు ఈ  దురదృష్టం ?
ఇంకా ఎంత కాలం ఇలా   మోసపోతారు ?
 ఆంధ్రులారా చేవ చచ్చినవారా  ?
చేతకాని వారా ?
కళ్ళు తెరిచి,  కాళ్ళు పట్టడం మాని పీక పట్టండి !


Wednesday 28 January 2015

నాలుగో దోస

దుడ్డుగాడికి చాలబాధగా వుంది, వాళ్ళ నాన్న వెళ్ళిపోయాక ఆయన తిట్టిన తిట్లు గుర్తోచ్చి బాధ పడిపోతూ అప్పుడే వాళ్ళ అమ్మ ఊరు వెళుతూ వేసిచ్చిన డజన్ దోశలని దుఖంతో తిని లీటర్ పాలు దుఖంతో తాగాడు.
అప్పుడే వచ్చిన బడ్డుగాడిని చూసి వాడంటే ఉన్న ఇష్టంతో వాడికి కూడా దోశలు పెట్టాలని అనుకున్నాడు.
లోపలి కి వెళ్లి కిచన్లో చూస్తె వాళ్ళమ్మ వేసిన దోశలు ఐపోయాయ్ మరే డజన్ దోశలు వాడే తినేశాడుకదా
మరేం చెయ్యాలి అని ఆలోచించి వాడిని ఖాళి కడుపుతో పంపడం ఇష్టంలేక వాడే దోశలు వెయ్యాలని నిర్ణయం తీసుకున్నాడు. అసలు దోశలు తినడం వచ్చుకాని దోశలు వెయ్యడం రాదు వాడికి. మరి ఏమిచెయ్యాలి అని ఇంకోసారి బాగా చించి అదే ! ఆలోచనలని  బాగా చించి, వాడి చిన్నపుడు చిరగ్గా వేసిన మాడిపోయిన ఒకే ఒక్క దోశ ఎలా వేసాడో
 గుర్తు తెచుకుంటూ పొయ్యమీద పెనం పెట్టి  దోశలు  వెయ్యడం  మొదలు పెట్టాడు
మొదటి దోశ : అసలు దానిని దోశ  అని అనుకోలేదు, పిల్లులు  పీకిపడేసిన ఒక రబ్బరు ముక్కలాగా వచ్చింది.
                 దానిని బడ్డుగాడికి పెట్టి వాడిని బాధపెట్టలేడు
రెండో దోశ : ఇది దారుణంగా ఒక చింపి పడేసిన కాగితంలా వచ్చింది, బడ్డుగాడికి సరిపోదు
మూడో దోశ: ఇది దోశ ఆకారంలో వచ్చింది కాని ఒక చార్ట్ మీద బొగ్గుతో గీసినట్టుగా నల్లగా మాడిపోయింది
నాలుగో దోశ : దుడ్డు గాడు జాగ్రత్తగా సుతారంగా దోస వేసాడు. అద్బుతం ఇది దోసలాగే వచ్చింది. దోరగా కాలింది. వాతావరణాన్నిఅద్భుతమైన దోస సువాసనతో నింపేసింది
అంతే ఒక్కసారిగా దుడ్డు గాడు రెచ్చిపోయి  ఆ నాలుగో దోసనుంచి డజను దోశలు  వేసేసాడు. వాటిని బడ్డుగాడికి
తినిపించి వాడి ఆకలి తీర్చాడు. అంత అద్భుతమైన రుచికరమైన దోశలు తిన్నాక బడ్డుగాడికి  ఆనందభాష్పాలు రాలాయి. వాడికి దుడ్డుకి ఏదైనా సహయం చెయ్యాలని వూరు అందరికి దుడ్డు గాడి దోసల రుచి చెప్పి, వాడిచేత
ఒక దోస హోటల్ పెట్టించాడు
దుడ్డు గాడు జాగ్రత్తగా సుతారంగా దోశలు  వెయ్యడం  మొదలు పెట్టాడు. వాడి దోశలు చాల ప్రఖ్యాతమైపోయి
కొన్నాళ్ళ తరువాత దుడ్డు గాడు ప్రపంచంలో కెల్లా రుచికరమైన దోశలు వేసేఒక బ్రహ్మాండమైన చెఫ్ గాపేరు గడించాడు.
ఇప్పుడు వాళ్ళ నాన్న వాడిని తిట్టటం లేదు, వాళ్ళ అమ్మకి వీడే దోశలు వేసి పెడుతున్నాడు.
ఇక్కడ ఎవరికీ తెలియని విషయం ఏమిటంటే ఆ రోజు వాడు వేసిన నాలుగో దోస కంటే ముందు వేసిన మూడు దోశలు కధ. అది ఒక్క దుడ్డుగాడికి  మనకి తప్ప ఎవ్వరికీ తెలీదు. చివరికి బడ్డుగాడికి కూడా.

మనం ఎలాగు చెప్పం దుడ్డుగాడు అసలే చెప్పడు

కధ: చైతు ,
రచన:  సత్య

Wednesday 21 January 2015

షి టీమ్స్ ఏ కాబ్ లో మహిళలు వున్నారో ఎలా గుర్తిస్తారు?

కేంద్ర, రాష్ట్ర ప్రబుత్వాలకు ఒక విజ్ఞప్తి
షి టీమ్స్  ఏర్పాటుచేసి మహిళలకు రక్షణ కల్పించాలనే ఆలోచన మంచిదే, కొన్ని రాష్ట్రాలలో అప్పుడే అమలుకూడా  చేసారు.  అయితే  ఏ  కాబ్ లో మహిళలు వున్నారో ఎలా గుర్తిస్తారు.?

బేబి ఆన్ బోర్డ్  అని కారుల్లో స్టికర్ పెడుతున్నట్లు,   షి ఆన్ బోర్డ్ అని కాబ్లవెనుక అద్దానికి సూచనలు పెట్టేలా చూస్తే కొంత మంచిదేమో ఆలోచించండి.  

కౌగిలింతల రోజు



కొన్ని మనకు ఆనందం కలిగించే రోజులు ఉంటాయి మనకు ఇష్టమైన వారికి కొన్ని ఇవ్వాలి అనిపిస్తుంది
కాని , కొన్ని   వారికి కూడా ఇష్టమైతేనే తీసుకుంటారు అలాంటివాటిలో కౌగిలింత ఒకటి

 ప్రేమికుల రోజు లాగ  ఇవాళ కౌగిలింతల రోజుట
ఇదికూడా అమెరికా  నించి  వచ్చిన రోజు .
ఇవాళ అక్కడ సెలవు కూడా.
శాస్త్ర వేత్తల  ప్రకారం కౌగిలింతల వలన మనలో ఒత్తిడి  తగ్గుతుందిట
మరింకేమి కౌగిలించు కోండి ఇష్టమైన వారిని

Monday 19 January 2015

కొన్ని సూచనలు పాటిస్తే స్వైన్ ఫ్లూ నించి తప్పించుకోవచ్చు

వణికిస్తున్న  స్వైన్ ఫ్లూ 
రక్తపోటు, మధుమేహం , గుండె జబ్బులకన్న  తగు జాగ్రత్తలు  పాటించకపోతే  స్వైన్ ఫ్లూ ప్రమాదకారే  !
కొన్ని సూచనలు  పాటిస్తే స్వైన్ ఫ్లూ  నించి తప్పించుకోవచ్చు. 

రోజు కొంచం సేపు ఉదయం ఎండలో వుండటం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది 
శుభ్రమైన ఆహార అలవాటులు పాటించండి 
చలి నుంచి రక్షణ పొందండి 
వీలైనప్పుడల్లా చేతులు  శుభ్రం  చేసుకోండి 
జలుబు, వళ్ళు  నొప్పులూ , కడుపు నొప్పి , జ్వరం , దగ్గు  వుంటే  త్వరగా వైద్యుడిని కలవండి 
జన సమ్మర్ధానికి దూరంగా వుండండి  
ఒక టి  స్పూను తులసి రసం , తేనే  కలిపి  రోజు సేవించండి. 

అందరికి వివరాలు అందిచడం వలన త్వరగా ఈ  మహమ్మారి నుంచి తప్పించుకోవచ్చు !

 

Saturday 17 January 2015

తెలంగాణాకి ఇంత ప్రత్యేకమా


నేటి విశేషాలు చూస్తుంటే ఒక గొప్ప విషయం దేశం లో మనం ప్రత్యేకం అని మళ్లీ  నిరూపిన్చుకున్నాం
దేశం  అంత పెట్రోలు ధర తగ్గుతుంటే మనకి మాత్రం ఆ ధర తగ్గుదల అందుబాటులోకి రాలేదు . ఎందుకో తెలుసా
వాట్ టాక్స్ పెంచి ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకుంటోంది .
హరి హరి !

Thursday 15 January 2015

గోత్రము , ప్రవర , వివాహ నిబంధనలు




గోత్రమంటే 
 నిజానికి    గోత్రమంటే ’ గోశాల’ అని అర్థము. సనాతన కాలంలో ఒకే వంశానికి చెందిన వారంతా వారి వారి గోవులను ఒకేచోట ఉంచి కాపాడుకొనేవారు. ఆ ప్రదేశాన్ని ’ గోత్రము ’ అని పిలిచేవారు. కాల క్రమేణా ఆ పదానికి అర్థంమారి, ఒక వంశమువారి పూర్వీకులు పరంపరగా సంభవించిన మూలపురుషుడి ( ఋషి యొక్క) పేరునే వారి గోత్రముగా పిలవడము మొదలైంది.
ఒక గోత్రము వారంతా ఒకే వంశానికి చెందిన వారు అని అందరూ అనుకుంటారు. కానీ మనకు తెలిసి ఒకే గోత్రపు వారు వివిధ  వంశాలలో ఉన్నారు. అంతే కాదు, వివిధ వర్ణాలలో కూడా ఉన్నారు. ఇవి బ్రాహ్మణ గోత్రాలు , ఇవి క్షత్రియ గోత్రాలు , ఇవి వైశ్య గోత్రాలు ..... ఇలా ఉన్నప్పటి కీ , కొన్ని గోత్రాలు పరిపాటిగా అన్ని వంశాలలోనూ ఉన్నాయి. ఇలా గోత్రాలు అన్ని వర్ణాలలోనూ కలసి ఉండటానికి కింద రాసినది చదివితే కొంతవరకు బోధ పడవచ్చు...
సనాతనంగా వచ్చిన గోత్రాల మూల ఋషుల వివరాలు పరిశీలిస్తే, ఆ ఋషులు అచ్చంగా ఎనిమిది మందే ! విశ్వామిత్ర, జమదగ్ని, భారద్వాజ, గౌతమ, అత్రి, వశిష్ట, కశ్యప మరియు అగస్త్య ఋషుల పేర్లమీద ఆ యా గోత్రాలు ఏర్పడ్డాయి. తరువాతి కాలంలోలక్షల కొలది లెక్కలేనన్ని గోత్రాలు పుట్టుకొచ్చాయి. ఒక్కొక్క ఋషి పేరుతోనూ , ఇతర ఋషుల సంబంధాలతో , అనేక కలయికలు కలిగి , గోత్రాలు ఏర్పడ్డాయి. ఆ గోత్రజుల సంతానానికి , అదే గోత్రము. నాది పలానా ఋషి యొక్క గోత్రము అని చెప్పితే దానర్థం, పరంపరగా వచ్చిన ఆ ఋషి సంతానంలో ఎక్కడా వంశం ఆగిపోకుండా అఖండంగా వచ్చిన మగ సంతానంలో ఒకణ్ణి అని చెప్పడం అన్నమాట. ఆడపిల్లలు పుట్టితే, పెళ్ళయ్యాక, భర్త గోత్రమే వారి గోత్రమవుతుంది. సగోత్రులు అంటే, అబ్బాయి, అమ్మాయి ఒకేగోత్రము వారైతే, వారు ఒకే ఇంటివారు అయి, అన్నా చెళ్ళెళ్ళవుతారు కాబట్టి వివాహమాడరాదు.
ప్రవర
కులము, గోత్రము తరువాత, వెంటనే వచ్చే మాట ’ ప్రవర ’. దీన్నే ’ ఆర్షేయ ’ అని కూడా అంటారు. దానర్థం, ప్రార్థిస్తూ ఆవాహన చేయడం. వ్యవహారికంగా ప్రవర అంటే , అగ్నిహోత్రమ్ చేసి, యజ్ఞము కాని, హోమము కానీ చేసే కర్త, తమ వంశములోని ప్రసిద్ధులైనవారి పేర్లను ఉటంకిస్తూ, ’ వారు చేసినట్టి హవనమే నేనూ చేస్తున్నాను, ’ అని అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తూ చేసే ఆవాహన. ( అగ్ని స్తుతి ) సాధారణంగా అత్యంత ప్రసిద్ధులైన తన వంశములోని ముగ్గురి / లేదా ఐదుగురి / లేదా ఏడుగురి పేర్లను చెప్పాలి. సాధారణంగా ఆ ముగ్గురూ, తన గోత్రపు మూల ఋషికంటే సనాతనులై ఉంటారు. ఇది ఒక విధంగా తనని తాను పరిచయం చేసుకోవడానికి కూడా చెపుతారు. ఉపనయనము అయిన వటువు కొత్తగా వేదము, శాస్త్రాలు నేర్పించే గురువు వద్దకు వెళ్ళి మొదట ఈ ప్రవర చెప్పాలి. ఎవరైనా గురు తుల్యులు, గురువుగారి గురువుగారు, లేదా పెద్దవారిని మొదటి సారి కలిసినప్పుడు తప్పనిసరిగా ఈ ప్రవర చెప్పాలి. ప్రవర చెప్పడానికి ప్రత్యేకమైన పద్దతి ఉంది. అది కింద ఇచ్చాను.

వివాహ నిబంధనలు
గౌతముడు , మరియు ఆపస్తంబుడి ప్రకారము , సగోత్రీయుల మధ్య వివాహాలు కుదరవు....చేసుకోకూడదు... ఎందుకంటే , ఒకే 
గోత్రములో పుట్టినవారు ఒకే ఇంటీ వారవుతారు. కాబట్టి వారు అన్నా చెల్లెళ్ళో , అక్కా తమ్ముళ్ళో, తంరీ కూతుళ్ళొ , తల్లీ కొడుకుల వరస కలవారొ అవుతారు...సగోత్రీకులంటే ఎవరు ? నిర్ణయ సింధువు ప్రకారము ,
ఏ రెండు కుటుంబాలకు గానీ " ప్రవర " పూర్తిగా కలిస్తే వారు సగోత్రీకులు అవుతారు. ప్రవర అంటే , కింద చెప్పినట్లు ,
|| చతుస్సాగర పర్యంతమ్ గోబ్రాహ్మణేభ్య శ్శుభం భవతు
---------------------- ఇతి ఏకార్షేయ / త్రయార్షేయ / పంచార్షేయ / సప్తార్షేయ ప్రవరాన్విత
---- సగోత్రః , ----- సూత్రః, ----- శాఖాధ్యాయీ
.........................శర్మన్ అహం భో అభివాదయే ||
పైని ప్రవరలో , మన గోత్రము పేరు , గోత్ర ఋషుల పేర్లూ చెపుతాము. ప్రతి ఒక్కరూ , తమ గోత్రము ఏమిటో , తమ వంశ ఋషులు ఎవరో తెలుసుకొని ఉండాలి. కొన్ని వంశాలకు ఒకే ఋషి , మరి కొన్ని వంశాలకు ముగ్గురు ఋషులూ , కొన్నింటికి ఐదుగురు , మరి కొన్నింటికి ఏడుగురూ ఉంటారు. ఇంకా ఖాళీలలో , సూత్రః అని ఉన్న చోట తాము అనుసరించే సూత్రము ఏదో చెప్పాలి ( ఆపస్తంబ , బౌధాయన , కాత్యాయన ....ఇలా.. ) శాఖ అన్నచోట , తమ వంశపారంపర్యంగా అనుసరించే , అధ్యయనం చేసే వేదశాఖ పేరు చెప్పాలి ( యజు , రిక్ , సామ ... ఇలా ) శర్మన్ లేదా శర్మా అన్న చోట, బ్రాహ్మణులైతే తమపేరు చెప్పి శర్మా అని , క్షత్రియులైతే , వర్మా అని , వైశ్యులైతే గుప్తా అని చెప్పాలి.
బౌధాయనుల ప్రకారమైతే , సమాన గోత్రము లేక ' సగోత్రము ' అని నిర్ణయించడానికి కింది కొలమానము ఉపయోగించాలి.
మొదట , ఇద్దరి గోత్రమూ ఒకటే కావాలి. తర్వాత ,
* ఎవరికైతే ఒకడే ఋషి ఉంటాడో , అదే ఋషి ప్రవరలో గల కన్య తో వివాహము తగదు.
* ఎవరికైతే ముగ్గురు ఋషులు ఉంటారో , ఆ ముగ్గురిలో ఏ ఇద్దరైనా ప్రవరలో గల కన్యతో వివాహము తగదు.
* ఎవరికైతే ఐదుగురు ఋషులు ఉంటారో , ఆ ఐదుగురిలో ఏ ముగ్గురైనా ప్రవరలో గల కన్యతో వివాహము తగదు.
* ఎవరికైతే ఏడుగురు ఋషులు ఉంటారో , ఆ ఏడుగురిలో ఏ ఐదుగురైనా ప్రవరలో గల కన్యతో వివాహము తగదు.
ఇదీ , సగోత్రము అవునా కాదా అని నిర్ణయించే పద్దతి. అంతటితో అయిపోలేదు... అవి కాక, ఇంకొన్ని కూడా చూడాలి..
మాతృ గోత్రాన్ని వర్జించాలి. అంటే , తల్లి పుట్టింటి గోత్రాన్ని కూడా పరిగణించి , ఆ ప్రకారముగా సగోత్రమైతే వివాహమాడరాదు.
ఏఎ గోత్రాలకు యే యే ప్రవరలు అన్నది చాలా పెద్ద చిట్టానే ఉన్నది
ఇక నిబంధనల సడలింపులు
ఈ విషయములో సడలింపులు అంటు ఏవీ లేవు.
గోత్రము తెలియనిచో , తనని తాను ఎవరికో ఒకరికి ఇచ్చుకొని , వారి గోత్ర ప్రవరుడు కావాలి. తెలిసినచో , ఈ పద్దతి తగదు.
తెలిసి కానీ తెలియక కానీ సగోత్రీకులతో వివాహము జరిగి సంసారం చేస్తే , ప్రాయశ్చిత్తం చేసుకొని , ఆ కన్యని తల్లిలా ఆదరించాలి.
తెలిసి చేస్తే , గురు తల్ప వ్రతం చేసి , శుధ్ధుడై , ఆ భార్యని తల్లి లా ఆదరించాలి. ఆమెకు తానే ఆఖరి కొడుకు.
తెలియక చేస్తే , మూడు చాంద్రాయణ వ్రతాలు చెయ్యాలి.( చాంద్రాయణం అనగా , ఒక నెలలోని శుక్ల పక్షం లో మొదటి రోజు ఒక ముద్ద మాత్రమే అన్నం తినాలి. రెండో రోజు రెండు ముద్దలు , మూడో రోజు మూడు, ఇలా పౌర్ణమికి పదిహేను ముద్దలు మాత్రమే తినాలి. తర్వాత, కృష్ణ పక్షం లో ఒక్కో ముద్ద తగ్గిస్తూ తినాలి. అమావాశ్య కు పూర్తి ఉపవాసం ఉండాలి... ఇలా ఒక నెల చెస్తే అది ఒక చాంద్రాయణం. ) ఈ ప్రాయశ్చిత్తం తాను శుధ్ధుడవటానికి మాత్రమే... ఇది ఒక వెసులుబాటు కాదు.
Courtesy : Vibhata Mitra Garu

 గురువుగారికి కృతజ్ఞతలతో 

ఉగాది 2వ సంచిక

సంక్రాంతి శుభాకాంక్షలతో

 ఉగాది 2వ సంచిక మీ కోసం


https://www.youtube.com/watch?v=3R49Lu56piU

Tuesday 13 January 2015

సంక్రాంతి శుభాకాంక్షలు


భోగి మంటలు భోగ భాగ్యాలు
సంక్రాంతి లక్ష్మి పాడి పంటలు
కనుమ మినుములు  ఆయురారోగ్యాలు
మీకు ప్రసాదించాలని ఆకాంక్షతో
సంక్రాంతి శుభాకాంక్షలు

ముంగిట రతనాల ముగ్గులు తోడుగా గొబ్బెమ్మలు,  పిల్లల నెత్తిన దీవెనల  భోగిపళ్ళు , పిండివంటల ఘుమఘమలు వినువీధుల్లో గాలిపటాల సయ్యాటలు, హరిదాసుల సంకీర్తనలు, డూ డూ బసవన్నల విన్యాశాలు
మీకు చెబుతున్నాయి  సంక్రాంతి శుభాకాంక్షలు


Wednesday 7 January 2015

ఉగాది - ఆవిర్భావ సంచిక విశేషాలు


ఆవిర్భావ సంచిక




మీ ఆశలు  ఆశయాలు నెరవేరాలి
మీ బాధలు దూరం  కావాలి
ప్రతిరోజూ ఒక కొత్త అనుబంధాన్ని
సుఖ సంతోషాలు అందించి
చుక్కలమద్య చంద్రునిలా మీ కీర్తి ప్రకాశం
అంబరాన్ని తాకాలని
ఈ నూతన ఆంగ్ల సంవత్సర శుభకామనలు  మీకోసం


స్వాగతం సుస్వాగతం మీ అందరికి ఉగాది ఆడియో పత్రిక ఆవిర్భావ  సంచికలోనికి  ఇదే మా ఆహ్వానం
రండి కలసి విజ్ఞాన సాగరాన్ని మదిద్దాం
 ఈ   ఉగాది పత్రికలో సమయాన్ని బట్టి మనకి ఉపయోగపడే విషయాలు వివిధ శీర్షికలుగా వినిపించబడతాయి.
మనం ఒక ప్రదేశాన్ని చూసినపుడు అది ఎవరికైనా ఎలా సందర్సించాలొ   చెప్పాలనిపిస్తుంది   - దానినే " నే చూసాగా "అనే శీర్షికగా వినవచ్చు

ఒక మంచి కధో , పుస్తకమో గురించి విషయాలను "నే చదివా"  అనే శీర్షికగా వినవచ్చు
మనకు కొన్ని పరిస్థితులలో ఎందుకు ఇలా వుంది , అక్కడ ఏమి వుంది , ఎలా ఇక్కడి నుంచి బయట పడాలి అని తెలుసుకోవాల్సి వస్తుంది దాని గూర్చి వివరించేదే "ఎందుకు ?ఏమిటి? ఎలా ? " శీర్షిక
అలాగే ఒక మంచి సంగతి  "మనలో మాట" గా
ఇప్పటి కార్పోరేట్ కష్టాలు దాటాలంటే దానిలో వున్నా లోటు పాట్లు తెలియాలి అది తెలుసుకోండి " కార్పోరేట్  ప్రపంచంలో". అనే శిర్షిక కింద
ఒక సరదా కధో  సంగతో  "వెటకారం కధగా" వినవచ్చు . ఇంకా పిల్లల కోసం "బామ్మ చెప్పిన కధలు" ,
అలాగే ఒక మంచి పద్యం వివరణలతో , ఇంకా విభిన్నమైన శీర్షికలతో  మీకు స్వాగతం  పలుకుతోంది  ఉగాది.





Thursday 1 January 2015

అందుకోండి కొత్త తెలుగు శ్రావ్య పత్రిక ఉగాది

హితులు సన్నిహితుల ప్రోత్సాహంతో వచ్చిన కొత్త ఆలోచనకు కార్య రూపమే ఈ తెలుగు ఆడియో (శ్రావ్య) పత్రిక
మీ అనుభవాలను ఆలోచనలు పంచుకుంటారు 
కదూ


https://www.youtube.com/watch?v=U42Ye0q5l-0&feature=em-upload_owner-smbtn