SEARCH

Wednesday, 31 December 2014

ఉత్తరద్వార దర్శనం చేస్తే కలిగే పుణ్య ఫలం ఏమిటి?


అనంతమైన పుణ్యఫలం అని చెప్పుకోవాలి. భారతీయులు కాంతిని ఆరాధించేటటువంటి వారు. ప్రాజ్ఞ్ముఖంగా ప్రయాణించేటటువంటి వారు. దేహంలో ఎప్పుడూ కూడా ఎడమ భాగాన్ని కుడి భాగం నియంత్రిస్తూ ఉంటుంది. వామ భాగం స్త్రీ సంబంధితమైనటువంటి భాగం. ప్రేమ, పారమార్థిక దృష్టి, లౌకిక సుఖములు, ఆనందములు ఇవన్నీ కూడా ఉత్తర దిక్భాగంలో ఉంటాయి. వీటన్నింటినీ నియంత్రించేది ఎడమ భాగం. అలాగే మన దృష్టి కూడా నిరంతరం ఎడమ వైపుకే ప్రసరిస్తూ ఉంటుంది. ఉత్తరం దిక్కుకు ధనము, సంపద వంటి వాటికి ప్రాముఖ్యత ఉంది. అన్నింటికంటే మించి ఈ విశాల విశ్వమంతా కూడా తన చుట్టూ తానూ తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది అనుకుంటే ఈ విశ్వంలో ఉండే అంతర్భాగము axil అంటారు దానిని అది దీనికి వ్యతిరేకంగా తిరుగుతూ ఉంటుంది. ఈ విశ్వము దక్షిణం వైపునుంచి ఉత్తరం వైపుకు anti clockwise తిరుగుతూండగా అందులోని అంతర్భాగం ఉత్తరం వైపునుంచి దక్షిణానికి clockwise తిరుగుతుంది. "ప్రాగ్ ఆరభ్య దక్షిణేణ వర్తనం" మన హిందూ ధర్మంలో అందుకోసమే ఆలయానికి వెళ్తే ప్రదక్షిణ చేయాలి - ప్రాగ్ ఆరభ్య దక్షిణేన వర్తనం. ఉత్తరంగా, ఈశాన్యంగా, తూర్పుగా, ఆగ్నేయం, దక్షిణం ఇలా ప్రదక్షిణ చేస్తూ ఉంటాం. కనుక ఈ రెండింటి మధ్య ఉండే వైరుధ్యం వల్ల కలిగిన ఆకర్షణ శక్తి చేత మనం ఈ భూమిమీద అంటిపెట్టుకొని ఉన్నాం దానికే భూమ్యాకర్షణ శక్తి అని పేరు. 

ఈరోజున ఉత్తర దిగ్భాగ మార్గాన్ని అనుసరించి ఇంక రెండు మూడు రోజులలో సూర్యనారాయణ మూర్తి ఉత్తర దిగ్భాగంలో ప్రయాణం చేస్తూంటాడు. ఈరోజున మనం ఉత్తర దిగ్భాగంతో ప్రయాణం ప్రారంభం చేసినట్లయితే తప్పకుండా కైవల్యం లభిస్తుంది. ఈ భూమితో ఉండే ఆకర్షణ సంబంధిత సంబంధాలన్నీ కూడా తొలగిపోయి ఆ శ్రీమన్నారాయణ మూర్తిని చేరుకుంటాము. భవ బంధనాలన్నీ కూడా తొలగిపోతాయి. అనేటటువంటి రహస్యాన్ని కనుగొన్న ప్రాచీనులు ఈ అంశాలన్నీ కూడా శాస్త్రోక్తంగా చెప్తే అందరికీ అర్థం అవుతాయో లేదో అనే ఉద్దేశ్యంతో కథలను జోడించి విభీషణ శరణాగతి కథ, వైకుంఠ ఏకాదశి కథ, ముప్పది మూడు కోట్ల దేవతలతో ఆ స్వామి ఈనాడు మనకు దర్శనమిస్తాడు. మూడు కోట్లతో రంగధాముని దర్శనమిస్తాడు. ఇలా చెప్పి ఆలయాలవైపు మనల్ని మరల్చారు. స్వామి దర్శనం చేసుకోండి అంటూ అనుజ్ఞనిచ్చారు. మన ప్రయత్నం కాకుండా గురువుతో ప్రయత్నం కావాలి. స్వప్రయత్నం కూడదు అంటుంది ధర్మము. కాబట్టి నారాయణుడే అటువంటి మనలో జ్ఞానమును ప్రేరేపించు వాడు. ఆయన ప్రపన్నుడు. అడిగిన వాళ్ళందరికీ కూడా ఆశ్రయం ఇచ్చే ప్రపన్నుడు. ఎవరిని రక్షించాలా? అని సంసిద్దుడై ఉంటాడుట. కాబట్టి ఉత్తర ద్వార దిశగా మనం ప్రయాణం చేస్తే తప్పకుండా కోరిన కోరికలు నేరవేరుతాయి. అన్నింటికంటే కోరవలసినది ఏమున్నది? - ఈ లోకంతో భవ బంధనాలనుంచి విముక్తి. మోక్షము అంటే "ముచిల్ మోక్షణే" అని అర్థం. బంధనాలనుంచి ముక్తిని పొందడము, విముక్తిని కలిగించుకోవడము అని అర్థం. అందుకే ఉత్తర దిశ ఇంత ప్రాముఖ్యం కలది, ఇంతగా విశేషత ఈ పండుగకు ఉన్నది.


గురువుగారికి కృతజ్ఞతలతో 

Monday, 29 December 2014

ఇంట్లో పాడైపోయిన విరిగిపోయిన లేదా జీర్ణమైన విగ్రహాలు / చిత్ర పటాలు ( photos ) ఏంచేయాలి ?..

ఈ సమస్య మరియు ప్రశ్న అందరికీ ఉండేదే...చాలా మంది తమ ఇంట్లో పాడైపోయిన విగ్రహాలు కాని పటాలు కానీ ఏ దేవాలయం చెట్టు క్రిందో ఎవరూ తిరగని ప్రదేశంలోనో వదిలేసి హమ్మయ్య అనుకుంటారు. 

కానీ ఇలా చేయడంకన్నా ఉత్తమమైన మార్గం ఏంటంటే అటువంటి పటాలను అగ్నికి ఆహుతి ఇవ్వడం మంచిది. 

అదేంటి దేవుడి పటాలను అలా అగ్నిలో వేస్తారా ఎక్కడైనా ? అన్న సందేహం ఎంత మాత్రం అవసరం లేదు. అగ్ని సర్వభక్షకుడు, అన్ని వేళలా పునీతుడు.

 కనుక పవిత్రాగ్నిలో దేవతా పటాలను సమర్పించడం ఎంతమాత్రం తప్పుకాదు.
ఇక విరిగిపోయిన విగ్రహాలను నదిలో విసర్జించండి. ప్రవహిస్తున్న నదిలో వేయడం ద్వారా నీరు కలుషితం కాదు. 

అయితే అగ్నిలో వేయాలనుకున్న నదిలో వదలానుకున్నా ముందుగా ఆ విగ్రహానికి మనస్పూర్తిగా నమస్కరించి '' గచ్చ గచ్చ సుర శ్రేష్ఠ స్వస్థాన పరమేశ్వర '' అని వదిలేయండి.

ఇది కూడా నిమజ్జనం అని తెలుసుకోండి. దీనిని గురించి మీ మిత్రులకూ సమాచారం ఇవ్వండి. ధర్మ ఆచరణ చేయండి.ధర్మాన్ని కాపాడండి.

Saturday, 27 December 2014

చేబదులు ఇస్తేనే బాబో ! ఇంకా అప్పు ఇస్తే ?


డబ్బులు అప్పుగా ఇస్తాం కాని  వసూలు చేసుకోవడానికి పడే పాట్లు అన్ని ఇన్ని కావు 
సొంతవాడే అని ఇచ్చినా తిరిగి అడగడానికి మనం మొహమాటం పడి  అడగలేక అడిగితే,  నేనే చెపుదామనుకున్టున్నాను, త్వరలోనే ఇచ్చేస్తా అంటాడు.  
ఆ త్వరగా ఎప్పుడు వస్తుందో తెలియదు . 
మళ్ళి అడిగితే  పారిపోతాన అంటాడు.  

అదుగో అలాంటప్పుడు గుర్తుకొచ్చిన  వేమన పద్యం !  

కానివాని చేతగాసు వీసంబిచ్చి 
వెంట దిరుగువాడె వెఱ్రివాడు 
పిల్లితిన్న కోడి పిలిచినా పలుకునా 
విశ్వదాభిరామ వినుర వేమా ! " 

అర్ధం  ఏమిటంటే  : - 
" హీనునకు వడ్డీ కొఱకు డబ్బునిచ్చి వసూలు చేయుటకు వాని వెంట తిరుగువాడు వెర్రి వాడు.
పిల్లిచే తినబడిన కోడి పిలిస్తే వస్తుందా ? వేమా....రాదని  భావము . " 


ఇలాగ భోజనము చేయండి !



ఆకులమీద, ఇనుపపీటల మీద కూర్చొని భోజనం చేయకూడదు. డబ్బును ఆశించేవాడు మర్రి, జిల్లేడు, రావి, తుమ్మి, కానుగ ఆకుల్లో భోజనం చేయాలి. సన్యాసులు మాత్రం మోదుగ, తామర ఆకులో మాత్రమె భోజనం చేయాలి. భోజనానికి ముందూ తర్వాత ఆచమనం చేయాలి. భోజనం చేసేముందు అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావించి నమస్కరించి భుజించాలి. 

ఎన్ని సార్లు భోజనము  చేయాలి ?
ప్రతిరోజూ రెండుసార్లు భోజనము చేయాలని తైత్తిరీయ బ్రాహ్మణం సెలవిస్తోంది. రెండుసార్లు మధ్యలో ఏ ఆహారమూ తీసుకోకపోతే ఉపవాసం చేసినంత ఫలితం కూడా వస్తుంది.


భోజనము ఏవైపు తిరిగి చేయాలి?
 భోజనము చేసేటప్పుడు తూర్పు దిక్కుకి తిరిగి మాత్రమే భోజనం చేయాలి. తూర్పు దిక్కుకి తిరిగి చేయడం వల్ల ఆయుష్షు పెరుగుతుంది. అలాగే దక్షిణదిశగా తిరిగి భోజనము చేస్తే కీర్తి, ప్రతిష్ఠలు లభిస్తాయి. ఉత్తరం వైపు తిరిగి భోజనము చేస్తే కోరిన కోరికలు ఫలిస్తాయి. పడమర, దక్షిణం వైపున భోజనం చేయకూడదని పురాణాలలో ఉంది. కనుక తూర్పువైపు తిరిగి భోజనం చేయటం అనేది చాలా ఉత్తమమైన పధ్ధతి.

గురువుగారికి నమస్కారములుతో 

Saturday, 20 December 2014

మన పనుల ఫలితం - ముళ్ళు ?!

మనకు దగ్గరైన వారందరు మనవారు కాదు !
మనసుకు దగ్గరైన వారందరూ మంచివారూ కాదు ?!

ఎప్పుడైతే బుద్ధికి తోచినట్లు కాక మనసుకు తోచినట్లు చేస్తామో అది తప్పైనా మనం బాధపడం పైగా గర్వపడతాం. 
కాని ఒక రోజు తప్పకవస్తుంది.  మనం చేసిన తప్పు,  మనల్ని గునపంలా కాకపోయినా ముల్లుగా నైనా  గుచ్చుతుంది. 
ఆరోజు  మనం ఎంత వగచినా, చేసిన తప్పును సరి దిద్దుకొలేం, మరచిపొనూలేం!
అందుకే మంచి లేదా చెడు చేసేప్పుడు ఆలోచించాలి.

ఆలేస్యం అయిన తప్పు కాదు అసలు పని చేయక పోవడమే తప్పు !

Wednesday, 17 December 2014

పులుపు మంచిదే !

చూస్తే  నోరూరుతుంది తింటే పులుపు తిననె తినలేం,  అంటూ   నారింజ పళ్ళ గురించి చిన్నతనంలో  చదివిన ఒక పద్యం గుర్తుకు వచ్చింది.  

పుల్లగా ఉండే ఫలాల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. నిమ్మ, ఉసిరి, జామ, ఆపిల్ వంటి ఫలాల్లో సీ విటమిన్ పుష్కలంగా ఉంటుంది. రక్తం వృద్ధి చెందడానికి విటమిన్ సి ఎంతో దోహదం చేస్తుంది. 
చాలా మంది పులుపును తక్కువగా ఇష్టపడతారు. అది సరికాదంటున్నారు నిపుణులు. 

రక్తం తక్కువైన సందర్భాల్లో డాక్టర్లు ఐరన్ ఎక్కువగా లభించే ఆహారం తీసుకోవాలని సూచించడం తెలిసిందే. 

అయితే, మనం తీసుకున్న ఐరన్ రక్తవృద్ధికి తోడ్పడాలంటే విటమిన్ సి సాయం తప్పనిసరి. విటమిన్ సి లేకపోతే మనం స్వీకరించే ఐరన్ తగిన మోతాదులో శరీరానికి అందదు. దాంతో, రక్తవృద్ధి సాధ్యం కాదంటున్నారు నిపుణులు. విటమిన్ సి లోపిస్తే రక్తం గడ్డడం చాలా ఆలస్యమవుతుంది. అంతేగాకుండా, రక్తహీనత కలిగి నీరసం వస్తుంది. వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గుతుంది. భారత్ లో 70 శాతం మంది విటమిన్ సి లోపంతో బాధపడుతున్నారట.
పులుపు  మంచిదే ! మరి తినడం మొదలు పెడదాం.   పుల్ల చింతపండు కాదండోయ్ ! 
విరోచనకారి !

Monday, 15 December 2014

దేవుడు నీకు కనపడకపోతే లేనట్లేనా ?



ఓసారి ఓకాయన జుట్టు పెరిగితే, ఓ బార్బరు షాపు వెళ్ళి కూర్చున్నాడు.
ఆ కార్మికుడు ఈయన జుట్టు కత్తిరిస్తూ, "ఏమిటో సార్! జీవితం దుర్భరమవుతోంది. "దేవుడు" లేడు అనే నిశ్చయానికి వచ్చేశాను. లేకపోతే ఇన్ని అక్రమాలు, అరాచకాలు ఎందుకు జరుగుతాయి? ఆయన ఉంటే, ఇంత గోలలు ఎందుకు జరుగుతాయి? దేవుడు లేడు" అని నిరాశవాదంతో వచ్చినాయన పని ముగించాడు.
ఈయన బయటకు వెళ్ళి ఓ సారి తొంగి చూచి " ఇదిగో చూడు "బార్బర్లు కూడా లేరు" అన్నాడు.
" అదేమిటి? నేను ఇప్పుడేగా మీ పని చేసిపెట్టాను. బార్బర్లం ఉన్నాం" అన్నాడు.
"ఉంటే అడుగో ఆయనను చూడు. గడ్డం, మీసం, జుట్టు పెరిగి ఎలా ఉన్నాడో! బార్బర్లు ఉంటే ఆయన అలా ఎందుకు వుంటాడు." అన్నాడు.
"అదేమిటి! ఆయన నాదగ్గరకు రాలేదు! వస్తే, మీలాగే ఆయనకు అలాగే పని చేసి పెట్టేవాణ్నే." అన్నాడు,
" అవును! దేవుడు అంతే! నీకు దేవుడు సహాయం కావలసివస్తే, ఆయన దగ్గరకు వెళ్ళకపోతే ఎలా?
ఆయన దగ్గరకి వెళ్ళి ప్రార్ధించు. నీకు కావలసిన సహాయం ఆయన నీకు చేస్తాడు. " అని ఆయన బయటకు నడిచాడు.

దేవుడు నీకు  కనపడకపోతే లేనట్లేనా ? దేవుడు వున్నాడు.

గురువుగారికి కృతజ్ఞతలతో 

Saturday, 13 December 2014

నల్లధనం చెలామణికి అడ్డుకట్ట - పాన్, ఆధార్ కార్డులకు అనుసంధానం

రూ.1 లక్షకు పైగా విలువైన కొనుగోళ్లు జరపాలంటే,ఆధార్, పాన్ కార్డులను వెంట తీసుకెళ్లండి ఈ రెండింటిలో దేనినో, ఒకదానిని షాపింగ్లో  చూపించాల్సి ఉంటుంది. నల్లధనం వెలికితీతకు ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రతిపాదించిన ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది.

త్వరలోనే ఈ నిబంధనను దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. అంతేకాక ఆయా వ్యక్తులు వివిధ సందర్భాల్లో తమ గుర్తింపు కోసం చూపుతున్న డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ కార్డు తదితరాలను కూడా పాన్, ఆధార్ కార్డులకు అనుసంధానించాలని కేంద్రం యోచిస్తోంది. 

Tuesday, 9 December 2014

స్వచ్ఛభారతు - బుద్ధిమాన్ భారత్


అంతట నిండివున్న నన్ను ఎలా కాదనగలవు ?
అజ్ఞానం, మూర్ఖత గురించి నేను తలచుకున్నపుడు ఉదాహరణలు  కోకొల్లలు
పిల్లలను బడి వద్ద వదిలి వస్తున్నపుడు నా ముందు ఆగిన వాహనం నడిపే వ్యక్తి  సరిగా సంభాలించలేక వెనుకనున్న నా వాహనాన్ని డ్హీ  కొట్టాడు . పిల్లలు తూలీ పడబోయారు ,  నేను ఇంకా ఏమి అనకుండానే  దారికడ్డంగా ఎలా ఆపుతావు చూడు  నీవల్ల వెనుకాల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని మొదలు పెట్టాడు.
ఆహా ! క్షమాపణలు ఇలా చెపుతారా అని ఆశ్చర్యపోక ఇంక చేసేదేమివుంది ?
స్వచ్ఛభారతుకాక  బుద్ధిమాన్ భారత్ మొదలు పెట్టమని కోరుతున్నా
 ఎందుకంటే చదువు కున్న వాళ్ళే వాదినలో గెలవాలని చూస్తున్నారు కాని, తగవులు కూడదని  తెలుసుకోవటలేదు.
ఇక్కడే ఇంకొక విషయం,  విడాకులు  కోరుతున్న వారిలో ఎక్కువ  విద్యాధికులేనట !
సరే ముందుకు బయలు దేరితే ఆటో వాడు అడ్డు వచ్చాడని గొడవ పడుతున్నాడు ఇంకో  వాహన దారుడు
భాగ్యనగర వారసులు వాళ్ళేనని  ఇంకా తెలిసినట్లు లేదు !

జ్యోతితో ఇంకొక జ్యోతిని వెలిగించవచ్చు
నీటితో వెలుగు  కుదరదు
జ్ఞానినుంచే జ్ఞానసముపార్జన చేయవచ్చు
అంధుడు ఇంకొక అందునకు దారిచూపలేడు  కదా !
అ ప్రదేశంలోనే చాల కాలంగా వున్నా సరే

Monday, 8 December 2014

శ్రీ దత్త శరణం మమ



శ్రీ దత్త చరణం శరణం మమ 

దత్తత్రేయులవారిని తలచుకుంటే మూడు  ముఖముల మూర్తి కనిపిస్తారు. కాని వారిని ధ్యానిన్చినపుడు మన సాధన లో పరిపక్వత వచ్చినపుడు ఏక ముఖము తో మనకు దర్శనం ఒసగుతారని విన్నాను. 





త్రిముఖ దత్తాత్రేయుల వారు 





ఏక ముఖ దత్తాత్రేయుల వారి రూపం.

సర్వులకూ  శుభములు చెకూర్చమని ప్రార్ధనలతో
ఇతి సమ్ !


Friday, 5 December 2014

నీకై వేచివున్న నీ నేను !

నువ్వు వస్తావని నేను చూసే ఎదురుచూపుల్లో నీ కరకు చూపుల చురకత్తులు  గుచ్చుతావు
నీ ఓదార్పు ఆస్వాసనకై వేచి ఉన్న నాకు నీ కఠిన శల్య సదృశ ఘాతలే విసురుతావు
 నువ్వు చిందించే చిరునవ్వుల్లో నన్ను చూసుకుని మురిసిపోదామంటే నవ్వే తెలియని గ్రీష్మానివవుతావు
నా చిన్నచిన్న కోరికలు తీర్చే సమయం లేని నీవు నా జీవిత శరత్తుగా ఎప్పుడు మారతావు ?!

Thursday, 4 December 2014

పరమాత్మ దృష్టి లో ”నీవే నేను -నేనే నీవు

ఒక రోజు శ్రీ రాముడు హను మంతుని దగ్గరికి పిలిచి ”హనుమా !నేను చెప్పిన వేదాంత విషయాలన్నీ విన్నావు కదా .దేహ ,జీవ ,పరమాత్మ లకు సమన్వయము చేస్తూ చెప్పు ”అని కోరాడు .అదే శిరో ధార్యం గా భావించిన పరమ భక్త శిఖా మణి మారుతి ”శ్రీ రామా !వేదాంత రహస్యము తెలిసిన తరు వాత కూడా ఈ దేహం ఉన్నంత వరకు దేహాన్ని ,జీవుణ్ణి ,పరమాత్మ ను వేరు వేరు గా నే భావించాలి .దేహ దృష్టి తో పరమేశ్వరుని ధ్యానిస్తూ ,సేవించాలి .అన్ని భావాలను త్యజించి ,శరణా గతి పొందాలి .ఇతరులకు ఉపకారం చేస్తూ ,వారు కూడా భగవంతుని స్వరూపం గా భావించి ,సేవించాలి .ఇలాంటి దానినే భక్తి లక్షణం అంటారు .ఇదే విశిష్టాద్వైత సిద్ధాంతం .జీవుడు వేరు ,పరమాత్మ వేరు అని భావిస్తూ ,భగవంతుని స్మరిస్తూ , ,భగవంతుని పూజలు చేస్తూ ,భగ వంతుని మూర్తులను చూసి ఆనందిస్తూఉండటానికి ద్వైతం అంటారు .జీవుడు ,పరమాత్మ ఒక్కరే .ఎందు లోను భేదం అనేది లేదు అని భావన లో ,ఆచరణ లో చూపించటం జ్ఞాన లేక ,విజ్ఞాన లక్షణం అంటారు .ఇదే అద్వైత భావన .”దేహ బుధ్యాతు దాసోహం ,జీవ బుద్ధ్యాతు త్వదంశః ఆత్మా బుధ్యాతు త్వమేవాహం ఇతి మే నిశ్చితా మతిహ్ ” రామా ! దేహ దృష్టి లో నేను నీకు దాసుడిని .జీవ దృష్టి లో నీవు పరమాత్మవు .నీ అంశ చేత నేను జీవ స్వరూపుడను .పరమాత్మ దృష్టి లో ”నీవే నేను -నేనే నీవు ”.ఈ మూడు లక్ష ణాలు నాలోనూ ,నీలోను ఉన్నాయి .ఇంక భేదానికి అవకాశమే లేదు .”అని స్పష్ట పరచాడు హనుమ .అంజనా నందనుడి సమాధానం విని పరమానంద భరితు డయాడు దాశరధి .”త్వమేవాహం ,త్వమేవాహం ”అని చాలా సార్లు హనుమ ను అభి నందించాడు .
”యత్రాస్తి భోగో నహి తత్ర మోక్షః యత్రాస్తి మోక్షో నహి తత్ర భోగః శ్రీ మారుతిత్సేవన తత్పరాణాం భోగశ్చ ,మోక్షశ్చ ,కరస్త యేవ ” అంటే ఎక్కడ భోగం ఉంటుందో అక్కడ మోక్షం ఉండదు .ఎక్కడ మోక్షం ఉంటుందో అక్కడ భోగానికి అవకాశమే లేదు .కాని శ్రీ హనుమ సేవా తత్పరు లైన వారికి భోగమూ ,మోక్షమూ రెండు తప్పక లభిస్తాయి అని శ్రీ రాముడు ”వరం ”అను గ్రహించాడు .దానికి వెంటనే ఆంజనేయుడు ”నువ్వు శివుడవు .నేను భద్రుడను .నీకూ నాకు భేదమే లేదు ”అని చెప్పాడు .


గురువుగారికి నమస్కారములతో 

Monday, 1 December 2014

విండ్ ట్రీలు - పవన విద్యుత్తు

 ఫ్రాన్స్ లోని బ్రిటన్ కు చెందిన ఓ ఇంజినీర్ల బృందం మూడేళ్లపాటు రకరకాల ప్రయోగాలు చేసి విండ్ ట్రీను తయారు చేసింది. 'విండ్ ట్రీ' పేరుతో వచ్చే ఏడాది ఈ చెట్లు మార్కెట్లోకి రానున్నాయి. 26 అడుగుల ఎత్తుండే ఒక్కో చెట్టు ధర రూ. 20 లక్షలకు పైగానే ఉంటుంది. ఒక్కసారి ఈ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయగలిగితే చాలు... జీవితాంతం కరెంటును పొందవచ్చని దీన్ని తయారు చేస్తున్న కంపెనీ ప్రకటిస్తోంది.
విండ్ ట్రీలు నిజంగా చెట్లు కావు. ఇవి చెట్ల ఆకారంలో ఉన్న గాలి మరలు. ఆకుల స్థానంలో దీర్ఘవృత్తాకారంలో ఉన్న టర్బైన్లు ఉంటాయి. గాలి వీచినప్పుడల్లా ఇవి తిరుగుతాయి. అప్పుడు టర్బైన్లలో ఉండే పలుచటి బ్లేడ్లలో కదలికలు ఏర్పడి కరెంటు ఉత్పత్తి అవుతుంది. గాలి ఏ దిశలో వీచినా బ్లేడ్లు కదలడం ఈ చెట్ల గొప్పదనం. సాధారణంగా 8 మైళ్ల వేగంతో గాలులు వీస్తే తప్ప పవన విద్యుత్తును ఉత్పత్తి చేయడం సాధ్యం కాదు. కానీ, విండ్ ట్రీతో కరెంటును ఉత్పత్తి చేయాలంటే, కేవలం 4.5 మైళ్ల వేగంతో గాలి వీస్తే చాలు. విశాలమైన, ఎత్తైన ప్రదేశాల్లోనే కాకుండా... ఇంటి దగ్గర, రోడ్ల కూడళ్లలో కూడా వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు.