ఏ పనీ చేయకుండా పోచికోలు కబుర్లు చెప్పుకుంటూ, వింటూ సమయం గడిపే చాలా మందిని, మనం చూస్తూనే ఉంటాం .
ఇతరుల గురించి తెలుసుకోవాలనే తపన అందరికీ ఉంటుంది.
గ్రామీణ జీవనంలో రచ్చబండలు, వీధి మలుపులు, ఇలాంటి కబుర్లకు ఆలవాలంగా ఉండేవి.
నేటి అపార్టుమెంటు కల్చరులో వీటికి తావెక్కడ!
మేము మోడ్రను మనుషులం, ఇంకా పల్లెటూరి వాళ్ళను గేలి చేస్తాం అనే వారు కూడా తమ సమయం వృధా చేసే ఈ సోది కబుర్లకు బానిసలే !
ఎలా ? ఇప్పుడు ఎక్కడ మాట్లాడుతున్నారండి ? అని అడిగితే
మీ స్మార్ట్ ఫోన్ సమాధానం చెబుతుంది.
మీకు ఫెస్ బుక్ ఎకౌంట్ ఉందా ? వాట్సప్ మీ ఫోనులో ఉందా ? సోషలు నెట్ వర్కింగ్ సైటుల్లో ఏదైనా ఒకటే?!
ఇంకేం, మీరు కూడా ఈ బాపతే !
ఫేస్ బుక్ లో, వాట్సప్ లో వచ్చే మెస్సేజ్ లు ఎన్ని నిజమైనవి ?
ఇది చూసినవెంటనే ఫార్వార్డ్ చేయకపోతే మీకు దురదృష్టం పడుతుంది అనేవి, గుడ్ మాణింగ్, గుడ్డు నైట్, తప్ప వేరేవి అవసరమైనవి ఎక్కువ రావు ?
మంచివి, అవసరమైన సమాచారం పది శాతం ఉంటుందేమో ?
మరి పనికిరాని మెసేజులు ఫార్వార్డులు కొడుతూ, వేరే ఎవడి ఫోటోనో నీకు తెలియకపోయినా కామెంట్లు వేస్తూ సమయం గడిపే వారు, ఎర్రబస్సు నీడలోంచి బయట పడని వారే కదా !?