SEARCH

Tuesday, 12 August 2014

వీటితో గుండె భద్రం

సరైన ఆరోగ్యం ఆహారం వ్యాయామం  వీటితో గుండె జబ్బులకు దూరంగా వుండొచ్చు  

ప్రపంచంలో అత్యధిక మరణాలు సంభవిస్తోంది హృదయ సంబంధ వ్యాధుల కారణంగానే. వైద్యులందరి మాట ఇదే. ఇంతటి ప్రమాదకర వ్యాధిని సింపుల్ గా దూరం పెట్టొచ్చంటున్నారు వైద్య నిపుణులు. ఇందుకుగాను మూడు అంశాలను ఆచరణలో పెడితే సరి అని అంటున్నారు. వాటిని కచ్చితంగా పాటిస్తే కార్డియోవాస్కులార్ జబ్బులు చెంతకు రావట. అవేంటో చూద్దాం... 

ఆరోగ్యకర ఆహారం

కొవ్వు తక్కువగా ఉన్న ఆహారాన్ని మితంగా భుజించాలి. ధాన్యాలు, పీచు పదార్థం ఉన్న కాయగూరలు ఎక్కువగా తీసుకోవాలి. పుష్కలమైన ప్రొటీన్ల దృష్ట్యా చేపలు, కోడి మాంసం, గుడ్లు, బీన్స్, జీడిపప్పు, బాదం పప్పు వంటి బలవర్ధకమైన ఆహారపదార్థాలకు డైట్ చార్టులో చోటు కల్పించాలి. ఇవేకాదు, తాజా ఫలాలు, నవనవలాడే కూరగాయలు మన గుండెకు మేలుచేస్తాయి. అన్ శాచురేటెడ్ ఫ్యాటీ ఫుడ్స్ ను తీసుకోవచ్చు గానీ, ట్రాన్స్ ఫ్యాటీ పదార్థాలకు దూరంగా ఉండాలి. 

శారీరక వ్యాయామం

రోజూ అరగంటపాటు కసరత్తు చేయాలి. తద్వారా గుండెజబ్బు రిస్క్ కాస్తంత తగ్గించవచ్చు. జిమ్ కు వెళ్ళగలిగే సౌలభ్యంలేని వాళ్ళు... మెట్లెక్కి దిగడం, వాకింగ్ చేయడం ద్వారా వ్యాయామం కల్పించుకోవాలి. దీంతో, బరువు అదుపులో ఉండడమే కాదు, రక్తపోటు, హై కొలెస్ట్రాల్, మధుమేహం వంటి వ్యాధుల నుంచి ముప్పునూ తగ్గించవచ్చు. 

పొగాకుకు దూరంగా ఉండాలి

గుండె ఆరోగ్యం ఎక్కువగా దెబ్బతినడానికి ఉన్న అవకాశాల్లో పొగాకు ప్రధానమైనది. హృద్రోగం తీవ్రమవడానికి ధూమపానం, పొగాకు ఉత్పత్తులు నమలడం వంటి అంశాలు కారణమవుతాయి. ఆ అలవాట్లకు స్వస్తి చెబితే గుండెజబ్బు ప్రమాదం క్రమంగా తగ్గుముఖం పడుతుంది.

No comments:

Post a Comment