SEARCH

Saturday 18 October 2014

జలుబు, దగ్గు ? ఇంట్లో లభించే వస్తువులతోనే చెక్ !

వర్షాకాలంలోనూ, చలికాలంలోనూ బాగా వేధించే సమస్యలు జలుబు, దగ్గు. అన్ని వయసుల వారూ వీటి బారిన పడక తప్పదు. ముఖ్యంగా వీటి కారణంగా పిల్లలు చాలా ఇబ్బంది పడతారు. ఒక్కోసారి మందులు వాడినా ఉపశమనం లభించదు. అలాంటి సమయాల్లో ఇంట్లో లభించే వస్తువులతోనే వీటికి చెక్ పెట్టొచ్చంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం. 

నీటిలో కొద్ది పరిమాణంలో వాము, తులసి ఆకులు వేసి మరిగించాలి. ఆ ఆవిరిని చిన్నారికి పట్టిస్తే దగ్గు చాలావరకు తగ్గిపోతుంది. అంతేగాకుండా, ఛాతీ పట్టేసినట్టుగా అనిపిస్తే ఇది ఎంతో ఉపయోగకరం.

పసుపుకు యాంటీసెప్టిక్ గుణం ఉన్న సంగతి తెలిసిందే. వైరల్ ఇన్ ఫెక్షన్లపైనా ఇది సమర్థంగా పనిచేస్తుంది. వేడి పాలలో కొంచెం పసుపు వేసి జలుబు, దగ్గుతో బాధపడుతున్న పిల్లలకు తాగిస్తే ఎంతో రిలీఫ్ గా ఫీలవుతారు. 

జలుబు చేసినప్పుడు గొంతులో నస సాధారణం. అందుకూ ఓ మార్గం ఉంది. గ్లాసు వేడి నీటిలో టీస్పూను ఉప్పు వేసి బాగా కరిగిన తర్వాత పుక్కిట పట్టాలి. రోజుకు రెండు సార్లు ఇలా చేస్తే సరి. 

వేడి నీటి ఆవిరి పట్టినా ఉపశమనం కలుగుతుంది. 10-15 నిమిషాల పాటు ఇలా ఆవిరి పట్టాలి. ఆ నీటిలో యూకలిప్టస్ ఆయిల్ కలిపితే మరీ మంచిది. శ్వాస సాఫీగా సాగేందుకు ఇది ఎంతో సహాయకారిగా పనిచేస్తుంది. 

పిల్లలకు తేనె అంటే ఎంత ఇష్టమో చెప్పనక్కర్లేదు. రోజులో రెండు మూడు సార్లు తేనెను వారితో కొద్దికొద్దిగా నాకిస్తే వ్యాధి నిరోధక శక్తి మెరుగవుతుంది. ఐదేళ్ళ వయసు పైబడిన పిల్లలకు తేనెలో దాల్చిన చెక్క పొడి కలిపి తినిపిస్తే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. 

జలుబు తీవ్రంగా ఉన్నప్పుడు పిల్లల ఛాతీపై ఆవనూనెకు వెల్లుల్లి కలిపి మసాజ్ చేయాలి. చిన్నారి ఛాతీపైనా, మెడ, వీపు భాగాల్లోనూ మెల్లగా మసాజ్ చేయాలి. 

శరీరానికి మంచినీరు ఎంతో అవసరం. పిల్లలు జలుబుతో బాధపడుతున్నప్పుడు వారికి ఎక్కువ సార్లు మంచినీరు తాగించాలి. అప్పుడు శరీరం వ్యాధితో సమర్థంగా పోరాడగలదు. కోల్పోయిన నీటి శాతం వెంటనే భర్తీ అవుతుంది. 

No comments:

Post a Comment